If you want to Know about India then Read about Swami Vivekananda

ఇండియా గురించి తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి.

https://itsforyoum.blogspot.com/

"భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానంద గురించి చదవండి"... ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రముఖ కవి, రచయిత, నోబెల్ ప్రైజ్ గ్రహీత శ్రీ " రవీంద్రనాథ్ ఠాగూర్ " గారు. ఆయన చెప్పిన ఈ ఒక్క మాట లోనే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆయనే కాదు మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తి ప్రదాత ఆయన. ఆయనే  స్వామీ వివేకానంద. నరేంద్రనాథ్ దత్త గా పుట్టి, జ్ఞానసముపార్జన తో వివేకానంద గా మారి ప్రపంచానికి భారతీయ విశిష్టతను చాటి చెప్పిన మహనీయుడు.

https://itsforyoum.blogspot.com/

ఏముంది ఆయన మాటలలో.....?

ఆ మాటలు నువ్వు ఒంటరిగా ఉన్న నీ వెనకాల వెయ్యి మంది ఉన్నారనే భావన కలిగిస్తాయి...

నువ్వు కష్టాల్లో ఉంటే రాబోయే ఆనందానికి ఆ క్షణాలు నిచ్చెనలు అని మనకు గుర్తు చేస్తాయి...

ఇప్పుడున్న క్షణం శాశ్వతం కాదు అని మనకు చెప్పి, పడుతున్న కెరటాన్ని ఆదర్శంగా తీసుకోమని చెబుతాయి. 

ఆయన చెప్పే ఒక మాట " కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు... పడినా లేస్తున్నందుకు..."

డబ్బు లేకపోతే కాదు, నీ జీవితానికి ఆశయం లేకపోతే నీవు అసలైన పేదవానివి అని ఆయన మాటలు జీవితం పై ఆశలు చిగురింపజేస్తాయి...

బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే అయినా మరో వెయ్యి సంవత్సరాలకు సరిపడా జ్ఞానబోధ చేసిన మాటలవి.ప్రపంచానికి, ప్రపంచ దేశాలకు భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని వివరించి చెప్పడం ద్వారా మాత్రమే కాదు, చేతల ద్వారా చేసి చూపించిన తెగువ ఆయనది. నీ బ్రతుకుకు, నీకున్న గుర్తింపుకు, నీ రేపటి భవిష్యత్తు కోసం తన ఆయుష్షును జ్ఞానంగా మలచి మనకు అందించిన మహనీయుడు ఆయన.

కానీ ఇప్పుడున్న ఈ తరంలో ఆయన గురించి తెలుసుకునే వాళ్ళు, ఆయనని తలచుకునే వాళ్లు, ఆయన గురించి మాట్లాడే వాళ్లు, కనీసం ఆయన గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి... ఎక్కడో పుట్టి, ఏదో చేసాడని, ఎవరికోసమో పోరాడాడు అని, ఎవరో ఫాలో అవుతున్నారు అని, ఎవరో హీరో అంటున్నారు అని చేగువేరా బొమ్మలను మన బైక్స్ పై అతికించుకుంటున్నాం. రౌడీయిజం ప్రవర్తనతో నటించే హీరోలను యూత్ ఐకాన్ లుగా పొగుడుతున్నాం... కానీ మన గురించి ప్రపంచానికి చాటి చెప్పిన మన వ్యక్తి, ఆ స్థాయికి రావడానికి పడ్డ కష్టాన్ని, మందలో ఒకడిగా కాదు, వంద లో  ఒకడిగా ఉండటానికి తనకు తానుగా చేసిన ప్రయత్నాన్ని, తనను తాను మలుచుకున్న విధానాన్ని తెలుసుకోవడానికి ఎంత మంది సిద్ధంగా ఉంటున్నారు.


అలా అని, పర దేశస్తులను లేదా ఇతరులను ఆదర్శంగా తీసుకోవద్దు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ అంతకంటే ముందు మన గురించి, మనకోసం పాటుపడిన వాళ్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. విజయాన్ని, పరాక్రమాన్ని అకుంఠిత దీక్షను, దేశభక్తిని, అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మనకందించిన వివేకానందుడు మన జాతి ఆత్మకు ప్రతీక. ఈ నేల ప్రేమకు చిరునామా.ఆయన్ని గౌరవించమని చెప్పడం మాత్రమే ఇక్కడి ఉద్దేశం. యూత్ ఐకాన్ గా ఇప్పుడు ఏ హీరో ఉన్నాడు అని తెలుసుకోవడం తప్పు కాదు, కానీ దానితో పాటు వివేకానందుని పుట్టినరోజు నేషనల్ యూత్ డే గా ఎందుకు అయిందో కూడా నేటి యువత తెలుసుకోవాలి. ఆయన మన కోసం ఏం చేశారో తెలుసుకోవాలి. 

కామంతో ఆడవారిపై పైశాచికంగా ప్రవర్తించే మనుషులు ఉన్న నేటి సమాజంలో ఉన్న యువత, స్వయంగా ఒక స్త్రీ తన దగ్గరికి కి వచ్చి మీరు అందంగా ఉన్నారు, చాలా తెలివైనవారు, మీతో నాకు మీలాంటి బిడ్డను కనాలని ఉంది అన్నప్పుడు, "నాలాంటి బిడ్డను ఎందుకు తల్లి, నన్నే నీ బిడ్డగా స్వీకరించు" అని చెప్పిన మహాత్ముని జీవితం గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని,మార్కులు తక్కువ వచ్చాయని, అనుకున్నవి సాధించలేదని ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్న మనుషులు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో, తినటానికి తిండి లేని స్థితి నుండి ప్రపంచ దిగ్గజాలు సైతం శిరసు వంచి పాదాభివందనం చేసిన యుగపురుషుడి చరిత్ర గురంచి టైం లేకపోయినా కచ్చితంగా చదివి తెలుసుకోవాలి. నేను, నా కుటుంబం మాత్రమే అని ఆలోచిస్తున్న ప్రస్తుత సమాజం నేనంటే నా దేశమనీ... నా దేశం అంటే దేశం లోని ఆకలితో అలమటిస్తున్న ప్రజలనీ... వాళ్ల కోసం భోగభాగ్యాలను సైతం తృణప్రాయంగా వదిలేసి తన చివరి క్షణం వరకు పాటుపడిన ఆ మహాత్ముడు ఎవరో  తప్పు లేకుండా తెలుసుకోవాలి.  


ఆయన జనవరి 12, 1863 లో కలకత్తా లోని విశ్వనాథ దత్త - భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. తల్లిదండ్రలు ఆయనకు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. లోకం ఆయనను పిలుచుకునే పేరు వివేకానంద. ఆయనే విశ్వ వేదిక పై భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద. సామాన్య మనిషి గా పుట్టి, భారతీయ ఆధ్యాత్మిక ఋషి గా ఎదిగి భారతియ ఆధ్యాత్మిక  జ్ఞాన సముద్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. మీరు దేవుణ్ణి చూసారా.? అనే ప్రశ్న తో మొదలు పెట్టిన ఆయన జీవితం, తర్వాత ఎందరికో దేవుణ్ణి పరిచయం చేసే స్థాయికి వెళ్ళింది. స్వామి వివేకానంద జీవితం గురించి ఎంత తెలుసున్నా కూడా ఇంకా తెలుసుకోవాలనే ఆత్రుత తప్పకుండ వస్తుంది. అందుకే ఎందరో  గొప్ప గొప్ప వ్యక్తులు భారతీయులకు మరియు విదేశీయులకు సైతం మీరు భారత దేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గురించి చదవండి అని చెప్పేవారు.

పిల్లల భవిష్యత్తు అనేది తల్లిదండ్రుల పెంపకంలో నే  నిర్ణయించబడుతుంది అని చెప్పడానికి వివేకానందుని తల్లి దండ్రులు భువనేశ్వరి దేవి మరియు విశ్వనాథ్ దత్తా అతన్ని పెంచిన విధానమే  చక్కని ఉదాహరణ. అందుకు వివేకానందుని బాల్యంలో జరిగిన ఒక చిన్న సంఘటననీ ఉదాహరణగా చెప్పవచ్చు.

బాల్యంలో వివేకానందునికి జట్కా బండి పై ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. బడికి వెళ్తున్నప్పుడు రోజు జట్కా బండి పై ప్రయాణం చేసేవాడు. బడిలో ఒకరోజు క్లాస్ టీచర్ క్లాస్ లోని పిల్లలందర్నీ పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నారు అని అడిగారు. ఒకరు డాక్టర్ అని, ఒకరు లాయర్ అనీ, ఒకరు ఇంజనీర్ అని ఇలా రకరకాలుగా సమాధానం చెప్పారు. కానీ ఈ బాలుడు మాత్రం జట్కావాల అవుతా అని చెప్పాడు. క్లాస్ లోని వారందరూ ఆ సమాధానం విని గొల్లున నవ్వారు.ఇంటికి వెళ్లే లోపు ఈ విషయం తన తల్లి గారైన భువనేశ్వరి దేవికి తెలిసింది. ఆమె కూడా ప్రశాంత వదనంతో పెద్దయ్యాక ఏమవుతావు అనడిగింది. బడిలో చెప్పిన సమాధానమే  తన తల్లికి చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అలాగే అవుడువు గాని ఇలా రా అంటూ పూజామందిరంలోని తలుపులు తెరిచి అటువైపుగా చూపిస్తూ...

 "ఒక్క గుర్రం నడిపే బండి కాదు, అదిగో ఆ శ్రీకృష్ణుని లాగా నాలుగు గుర్రాలు నడిపే బండి కి నువ్వు జట్కావాలా కావాలి" అని బోధించింది. ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ అవి బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పి, "నువ్వు కూడా జగత్తుకి ఈ నాలుగింటిని నేర్పించే గురువువి కావాలి, సరేనా!" అంటూ ఆ బాలుడి ఆలోచనలని మలుపు తిప్పింది ఆ తల్లి. పెంపకం అంటే అదే. పిల్లలు తెలిసి తెలియక తప్పు చేసిన, తప్పు మాట్లాడినా వారిని సక్రమ మార్గంలో కి తీసుకెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

నీలా, నాలా, మనలా కాదు. అతనొక యుద్దం...నేడు నడుస్తున్న భారతావనికి స్ఫూర్తి  రథం.... హైందవ జాతి ఖ్యాతిని జగతికి చాటిన జ్ఞాన కిరణం... రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఖడ్గం... భారతీయ ఆధ్యాత్మిక తాత్వికతను విశ్వ వేదిక పై ఆవిష్కరించేందుకు సప్త సముద్రాలు దాటిన సాహసం ఆయనది... నిరాయుధమైన కాలాన్ని సాయుధం చేసిన ధైర్యం ఆయనది.

వివేకానందుని జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానల్స్ మరియు వార్త పత్రికలు  ఒక చిన్న ప్రయత్నం చేశాయి... ఇప్పుడు మన మధ్య ఉన్న యువతకు వివేకానంద గురించి ఎంతవరకు తెలుసు అని. దాంట్లో కొంత మంది మాటలు వింటే మనకు వాళ్ళ పైన కోపం కంటే కూడా జాలి ఎక్కువగా వస్తుంది. ఆయన గురించి ఏం చెప్పాలి అనుకున్న రెండు నిమిషాల్లో, మూడు నిమిషాలలో, పదినిమిషాలలో లేదా ఒక పోస్ట్ ద్వారానో ఆయన గురించి పూర్తిగా చెప్పలేం...కానీ ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈ పోస్ట్...

వివేకానంద గురించి మీకు తెలియజేయడం ఈ పోస్ట్  యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ఆయన ఎవరు, భారత దేశానికి ఆయన అందించిన ఖ్యాతి ఎటువంటిది అనే విషయాలన్నిటినీ మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం మీ చేత చేయించడం ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం.మహాత్మా గాంధీ గారు ఆయన గురించి ఒక్క మాటలో ఇలా అనేవారు " స్వామి వివేకానంద గురించి చదివాకా నాకు భారతదేశం పట్ల ఉన్న ప్రేమ రెట్టింపైంది" అని. అందుకే ఆ మహనీయుని గురించి, అయన చేసిన బోధనల గురించి మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్టుగా ఆయన గురించి తెలుసుకుంటే భారతదేశం గురించి తెలుసుకున్నట్టే అనే మాటను నిజం చేద్దాం...


👉👉👉స్వామిజీ గురించి ఇలాంటి పోస్టుల ద్వారా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో తెలియజేయండి.

👉👉👉👉మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి ....


👉👉👉గుండెపోటు ఎందుకు వస్తుంది ..?


👉👉👉 జీవితంలో ప్రతి ఒక్కరు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు 


3 Comments

  1. Super chala mandhi Yuvatha ki theliyajeyali swami Vivekananda gari Gurinchi
    Very nice super

    ReplyDelete
  2. గుడ్ ఇన్ఫర్మేషన్...ఇలాంటి పోస్టులు ఇంకా చెయండి బ్రదర్... 👌👌👌👌👌

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post